Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > మూసీ పునరుజ్జీవం కాదు.. అది రేవంత్ రెడ్డి ‘లూటీఫికేషన్’: హరీశ్ రావు ధ్వజం

మూసీ పునరుజ్జీవం కాదు.. అది రేవంత్ రెడ్డి ‘లూటీఫికేషన్’: హరీశ్ రావు ధ్వజం

Harish Rao Slams CM Revanth | మూసీ ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ దోపిడీకి తెరలేపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రేవంత్ రెడ్డి ఒక ‘తుగ్లక్’ లాగా వ్యవహరిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.

లూటీ కోసమే రూ. 1.50 లక్షల కోట్లు!

రాష్ట్ర ఖజానా ఖాళీ అని సాకులు చెబుతూనే, మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లతో టెండర్లు ఎలా వేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. “రైతు భరోసా ఇవ్వడానికి డబ్బుల్లేవు, ధాన్యం కొనుగోలు పైసలు ఇవ్వడం లేదు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది.. కానీ మూసీ పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి మాత్రం రేవంత్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారు” అని విమర్శించారు.

డిపిఆర్ లేకుండానే కూల్చివేతలా?

కనీసం డీపీఆర్ (DPR) కూడా సిద్ధం కాకుండానే వేలాది మంది పేదల ఇళ్లను ఎలా కూల్చుతారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం 10,017 నిర్మాణాలను తొలగిస్తే సుమారు లక్ష మంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే 32 ఎస్టీపీల ఏర్పాటుతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు వేశామని, కానీ రేవంత్ రెడ్డికి కేవలం రియల్ ఎస్టేట్ దందాపైనే శ్రద్ధ ఉందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రికి హరీశ్ రావు సంధించిన 8 సూటి ప్రశ్నలు:

  1. డీపీఆర్ రాకుండానే 10 వేల ఇళ్లకు నోటీసులు ఎలా ఇచ్చారు?
  2. మీరు చేస్తున్నది ప్రక్షాళనా? సుందరీకరణా? లేక పునరుజ్జీవనా? క్లారిటీ ఇవ్వండి.
  3. బఫర్ జోన్ 100 మీటర్లు అని ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? ఫ్లడ్ వాటర్ స్టడీ రిపోర్ట్ ఏది?
  4. ఏడీబీ లోన్ మంజూరైందని అసెంబ్లీలో అబద్ధం ఎందుకు చెప్పారు? దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం.
  5. భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు ఎంత పరిహారం ఇచ్చారో స్పష్టం చేయండి.
  6. మధు రిడ్జ్ వాసులకు ఇచ్చిన హామీలు మిగిలిన 46 కాలనీల వారికి కూడా వర్తిస్తాయా?
  7. మూసీ పరివాహక ప్రాంతంలోని మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలను కూడా కూల్చుతారా?
  8. బాధితుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏసీ హోటళ్లలో మీటింగ్స్ పెడితే ఏం ప్రయోజనం?

బీజేపీ తీరుపై ప్రశ్నలు

మూసీ పేరుతో జరుగుతున్న ఈ విధ్వంసానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఆహ్వానించడం ద్వారా బీజేపీ కూడా ఈ లూటీకి సహకరిస్తోందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

You may also like
harish rao pressemeet
తాటాకు చప్పుళ్లకు భయపడం.. సిట్ విచారణపై హరీశ్ రావు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions