KTR Pressmeet | కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న తీరును ఎండగట్టేందుకు… ఆరు గ్యారెంటీలకు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధత కల్పించేందుకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి తరపున ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ… ఆ హామీని, ఆ మాటను మరిచిపోయిందని కేటీఆర్ అన్నారు అందుకే ఆరు గ్యారెంటీ ల ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడతామన్నారు.
6 గ్యారంటీలలో పేర్కొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, రైతన్నలు వంటి తెలంగాణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం నేపథ్యంలో… ఆయా వర్గాల తరఫున ఈ ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
రాహుల్ గాంధీతో సహా 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కూడా ఈ బిల్లు ద్వారా శాసనసభలో ఎండగడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ రోజు గోల్కొండ రిసార్ట్ లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ సీనియర్ నేతలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు
కేటీఆర్ మీడియా సమావేశంలోని ముఖ్యమైన అంశాలు
ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్.. మూడవ బడ్జెట్. ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది.
వారి హామీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించాం.
మా పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు మాట్లాడారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారు.
ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు. ఇలా డెప్యూటీ స్పీకర్ కూడా శాసనసభలో లేరు. కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్ ని ప్రయోగిస్తున్నది.
శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది.
ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కానీ రెండన్నర సంవత్సరాల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు.
అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరపున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.
మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము.
ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని మా పార్టీ ఏర్పాటు చేసుకున్నది.
రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు.
ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.
ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం.
దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈరోజు జరిగిన సమావేశాల మాదిరి భవిష్యత్తులోనూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం. శాసనమండలి, శాసనసభ మధ్య మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్నది.
రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని చెప్తున్నది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపింది.
అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. కానీ ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నాడు.
మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం.
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే.
రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నది.
రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెప్తున్నాడు.
డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడు.
రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలి.
రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటే నేను రాజీనామా చేస్తానని చెప్పాను, దానికి నేను ఇంకా కట్టుబడి ఉన్నాను.
మేము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.










