YS Jagan wishes CBN a happy birthday | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
“నా ప్రియ మిత్రుడు, కష్టపడి పనిచేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది” అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. “చంద్రబాబు గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన దీర్ఘాయుష్షుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సందేశంలో చంద్రబాబు అనుభవాన్ని, విజన్‌ను కొనియాడారు. “సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు.
రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, యువతకు ఉపాధి కల్పన వంటి లక్ష్యాలతో సాగుతున్న ఆయన పాలనలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.






