Friday 30th October 2026
12:07:03 PM
Home > తాజా > మియాపూర్ భూములపై సుప్రీం చారిత్రక తీర్పు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

మియాపూర్ భూములపై సుప్రీం చారిత్రక తీర్పు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

revanth reddy

CM Revanth Reddy Press Meet On Miyapur Lands మియాపూర్‌లోని రూ. 50 వేల కోట్ల విలువైన వివాదాస్పద భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమార్కుల నుంచి ఇప్పటివరకు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములను రక్షించామని స్పష్టం చేశారు.

కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు..

మియాపూర్ భూముల రక్షణపై ప్రభుత్వం తరఫున కోర్టులో బలమైన వాదనలు వినిపించామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లు, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా తాను ఈ భూ ఆక్రమణలపై నిలదీసినందుకే తనపై కక్ష గట్టి గతంలో జైలుకు పంపారని సీఎం గుర్తుచేశారు. మియాపూర్ భూములను విక్రయించడం ద్వారా వచ్చే నిధులను రాష్ట్రంలో విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలు మరియు అభివృద్ధి పనులకు కేటాయిస్తామని తెలిపారు. దీనిపై త్వరలోనే కేబినెట్‌లో చర్చిస్తామన్నారు.

న్యాయపోరాటంలో నెగ్గిన ప్రధాన భూ వివాదాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు గురైన పలు విలువైన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటం ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుందని సీఎం వివరించారు:

  1. IMG భూములు: భలేరావు కుటుంబంతో కేటీఆర్ కుమ్మక్కై కొట్టేసేందుకు చూస్తే కోర్టు ద్వారా అడ్డుకున్నాం.
  2. కంచె గచ్చిబౌలి & మామిడిపల్లి: బీఆర్ఎస్ నేతల ఆక్రమణ యత్నాలను తిప్పికొట్టి విజయం సాధించాం.
  3. గుర్రంగూడ అటవీ భూములు: కేటీఆర్ అనుచరుల కబ్జా ప్రయత్నాలను సుప్రీంకోర్టులో పోరాడి, అది అటవీ భూమి అని తేల్చాం.
  4. మంచిరేవుల భూములు: 143 ఎకరాల భూమిని కేటీఆర్, రాయలసీమ బిల్డర్లతో కలిసి కబ్జా చేయ చూస్తే రక్షించి, ప్రస్తుతం అక్కడ పోలీసుల పిల్లల కోసం స్కూల్ నిర్మించాం.
  5. జయశంకర్ భూపాలపల్లి: బీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా ఇచ్చిన 400 ఎకరాల అటవీ భూమిని సుప్రీంకోర్టు ద్వారా కాపాడాం.

కేసీఆర్, హరీష్ రావుల లాలూచీ రాజకీయాలు..

“పద్మాలయ స్టూడియోస్, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఆ కేసుల నిందితులతో వారు లాలూచీ పడ్డారు” అని సీఎం మండిపడ్డారు. హరీష్ రావు మామ హనుమంతరావు కబ్జా చేసిన భూములను సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుని కోర్టు స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు.

అలాగే, రెండు గ్రామాల మధ్య ఉన్న వివాదాన్ని కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. అక్కడ ఆక్రమణలను తొలగించి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మియాపూర్ తీర్పుపై బీఆర్ఎస్ నేతలు కనీసం రెవెన్యూ అధికారులను అభినందించకపోవడం వారి కుట్రబుద్ధికి నిదర్శనమని, భూముల ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

You may also like
HYDలో ట్రాఫిక్ గందరగోళానికి అసలు కారణం అదే: జేపీ
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
Hyd నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త!
భాగ్యనగరంలో నకిలీ మసాలాల గుట్టురట్టు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions