- వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu Inaugurates Veligonda Project మార్కాపురం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. పూల సుబ్బయ్య వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైభవంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
కరువు ప్రాంతాలకు జలసిరులు..
ఈ ప్రాజెక్టు ప్రారంభంతో మార్కాపురం ప్రాంతంతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు కొత్త జీవం రానుంది. తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేశారు.
మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ప్రధాన కాలువల ద్వారా వినియోగించేలా దీనిని రూపొందించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు మేలు జరగనుంది.











