Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > TGలో కొత్త డ్రైవింగ్ రూల్.. LLR తర్వాత ఆన్‌లైన్ కోర్సు తప్పనిసరి!

TGలో కొత్త డ్రైవింగ్ రూల్.. LLR తర్వాత ఆన్‌లైన్ కోర్సు తప్పనిసరి!

New Driving Test Rules In TG | డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంస్కరణ చేపట్టింది. లెర్నర్స్ లైసెన్స్ (LLR) పొందిన అభ్యర్థులు ఇకపై శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ బుక్ చేసుకునే ముందు 2.5 గంటల ఆన్‌లైన్ రోడ్డు భద్రతా కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి చేసింది.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, కొత్త డ్రైవర్లలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని రవాణా శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఆరు మాడ్యూళ్లలో శిక్షణ

ఈ కోర్సులో మొత్తం ఆరు మాడ్యూళ్లు ఉన్నాయి. సుమారు 120 వీడియోల ద్వారా 64 రోడ్డు భద్రతా నియమాలు, డ్రైవింగ్‌కు సంబంధించిన ప్రాక్టికల్ అంశాలను బోధిస్తారు. ప్రతి మాడ్యూల్ దాదాపు 25 నిమిషాల నిడివి ఉంటుంది.

వాహనాన్ని స్టార్ట్ చేయడం, హ్యాండ్ బ్రేక్ వినియోగం, అద్దాలు సర్దుకోవడం, సీట్ బెల్ట్ వినియోగం, లైట్ల వినియోగం, పిల్లలు, మహిళల భద్రత, ద్విచక్ర వాహనాలపై సురక్షిత ప్రయాణం వంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు.

క్విజ్, ఫైనల్ అసెస్‌మెంట్

ప్రతి మాడ్యూల్ పూర్తయ్యాక ఐదు ప్రశ్నల క్విజ్ ఉంటుంది. అన్ని మాడ్యూళ్లు పూర్తయిన తర్వాత ఫైనల్ అసెస్‌మెంట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

నాలుగు భాషల్లో ఉచితం

ఈ కోర్సు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా ఎక్కడి నుంచైనా పూర్తి చేయవచ్చు.

అభ్యర్థులు కోర్సు ప్రారంభానికి ముందు ఫేస్ రిజిస్ట్రేషన్ చేయాలి. కోర్సు మొత్తం సమయంలో కెమెరాలో వారి ముఖం కనిపించేలా ఉండాలి. అవసరమైతే మధ్యలో పాజ్ చేసి తర్వాత కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది.

పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం

ఈ విధానాన్ని తొలుత కూకట్‌పల్లి ఆర్టీవో పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. నమోదు చేసుకున్న 1,070 మందిలో 890 మంది కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. పైలట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కోర్సు రూపకల్పనకు అయ్యే వ్యయంలో సుమారు 60 శాతం యూనిసెఫ్ భరించినట్లు రవాణా శాఖ తెలిపింది. అంతర్జాతీయ రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

You may also like
యమ ధర్మరాజు దగ్గర DRS ఉండదు.. సీపీ సజ్జనర్ ట్వీట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions