Tuesday 21st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ వీధుల్లో సైకిల్‌పై సీఎం చంద్రబాబు హంగామా!

విశాఖ వీధుల్లో సైకిల్‌పై సీఎం చంద్రబాబు హంగామా!

  • ఎర్రటి ఎండలో 5.5 కిలోమీటర్ల ప్రయాణం!

Chandrababu Naidu Bicycle Ride | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త గ్రీన్ ఇనిషియేటివ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖపట్నం నగర వీధుల్లో నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని చాలా దూరం పాటు ఉత్సాహంగా సైకిల్ ప్రయాణం చేశారు.

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు చూపిన చొరవ నగర ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహనను కల్పించింది.

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) క్యాంపస్ నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకూ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. దాదాపు 5.5 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని ఆయన కేవలం 21 నిమిషాల 18 సెకండ్లల్లోనే చేరుకుని తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.

ఈ సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి వెంట స్థానిక జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సైకిళ్లు తొక్కుతూ పాల్గొన్నారు.

సైకిల్ ర్యాలీ ప్రారంభానికి ముందు ఏయూ గ్రౌండ్స్‌ లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత నగరంలో ఏర్పాటు చేసిన నేషనల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌ షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మరోవైపు, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘వెహికల్ ఫ్రీ డే’ (Vehicle Day) సందర్భంగా ఆయన వరుసగా మూడో వారం కూడా సైకిల్ పైనే అమరావతి సచివాలయానికి బయలుదేరారు.

విజయవాడలోని తన క్యాంపు ఆఫీస్ నుండి సచివాలయం వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ తొక్కుతూ ప్రయాణించి పర్యావరణ స్పూర్తిని చాటారు.

You may also like
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం భరోసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions