Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు!

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు!

  • ఆ స్థలాల్లో మహిళలకే వాటా: మంత్రి పొంగులేటి

Minister Ponguleti Review On Indiramma Houses | పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, క్యూర్ పరిధిలో అల్పదాయ (LIG), మధ్యతరగతి (MIG) వర్గాల కోసం లక్ష ఇండ్లను నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలల్లో ఈ లక్ష ఇండ్లను నిర్మించి, ఆ స్థలంలో వారి వాటాకు యజమానిని చేస్తూ పేద కుటుంబాల ఆడబిడ్డలకే ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

3.50 లక్షల ఇండ్లకు అనుమతులు..
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు, అలాగే ఇతర ప్రాంతాలల్లో 2.50 లక్షల ఇండ్లకు.. మొత్తంగా 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని మంత్రి వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ లెవల్‌లో అవసరమైన కార్యాచరణను తక్షణమే రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కావు..
గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు.

ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో, వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారని మండిపడ్డారు.

రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు చేసుకునే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయారని.. ఉపాధి దూరం కావడంతో పాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో చాలా కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదన్నారు.

ఫలితంగా గత ప్రభుత్వం కట్టిన గృహాలు ఖాళీగా, నిరుపయోగంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. తాము అలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా, పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యత..
ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సొంత ఇల్లు మహిళా సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి బలమైన పునాది అవుతుందన్నారు.

పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్‌లను రూపొందించాలని, ప్రతి ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వి.పి. గౌతమ్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions