– అక్కడ భారీ వర్షాలు!
Southwest Monsoon Hits Kerala Tamil Nadu Coasts | గత కొన్ని నెలలుగా భానుడి భగభగలు, తీవ్రమైన ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ, తమిళనాడు తీరాలను తాకాయి.
రుతుపవనాల రాకతో ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో అప్పుడే వాతావరణం చల్లబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అక్కడ ‘ఆరెంజ్ అలర్ట్’ కూడా జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు?
మరికొద్ది గంటల్లోనే తమిళనాడులోని ఇతర జిల్లాలకు కూడా ఈ రుతుపవనాలు పూర్తిగా విస్తరించనున్నాయి. తమిళనాడు తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు కర్ణాటక మీదుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. వీటి రాకతో గత కొన్ని నెలలుగా ఎండ వేడితో, ఉక్కపోతతో అల్లాడిపోయిన తెలుగు ప్రజలకు త్వరలోనే భారీ ఉపశమనం లభించనుంది.
ఎల్నీనో ప్రభావంతోనే ఆలస్యం..
నిజానికి మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. కానీ ఈ ఏడాది ఎల్నీనో (El Nino) ప్రభావం బలంగా ఉండటంతో రుతుపవనాల రాక కొద్దిగా ఆలస్యమైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తక్కువ వర్షపాతం నమోదు?
అంతేకాకుండా, ఈ ఎల్నీనో ప్రభావం కారణంగానే ఈ ఏడాది సీజన్‌లో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతానికైతే ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







