Thursday 4th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రేపు అంతా సైకిళ్లపైనే ప్రయాణిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు!

రేపు అంతా సైకిళ్లపైనే ప్రయాణిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు!

Chandrababu World Environment Day Message | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఒక వినూత్నమైన, కీలకమైన పిలుపునిచ్చారు.

జూన్ 5వ తేదీ శుక్రవారం నాడు ప్రజలందరూ తమ వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి, కేవలం సైకిళ్లు లేదా ఎలక్ట్రిక్ సైకిళ్ల (E-Bicycles) పై మాత్రమే ప్రయాణించాలని కోరారు.

అలాగే పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్క నాటాలని సీఎం పిలుపునిచ్చారు.  పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రజల్లో అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు.

“ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక గొప్ప సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం.

అలాంటి పర్యావరణాన్ని రక్షించుకోవడం మన అందరి కనీస బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా ఉంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దాం” అని సీఎం పేర్కొన్నారు.

దేశంలో పచ్చదనాన్ని పెంపొందించడం, అలాగే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమన్నారు. అందులో భాగంగానే జూన్ 5న అందరం సైకిళ్లు, ఈ-సైకిళ్లపై ప్రయాణించి సరికొత్త మార్పుకు శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.

 శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. తన విశాఖ పర్యటనలో భాగంగా తానే స్వయంగా సైకిల్‌పై ప్రయాణించి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లోకి బలమైన సందేశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని సీఎం వెల్లడించారు.

సమాజ హితం కోరి చేపడుతున్న ఈ మంచి కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions