Pawan Kalyan Clarification On His Comments | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు.
ముఖ్యంగా ‘తెలంగాణ మీ అయ్యా జాగిరా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో, బుధవారం అమరావతిలో ఆయన ఈ ఇష్యూపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.
తెలంగాణ సమాజంపై తనకు ఎప్పటికీ అమితమైన గౌరవం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “తెలంగాణ అనేది కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే. నేల బిడ్డలు, తెలంగాణ యువత ఎంతో పోరాడి సాధించుకున్న జాగీరే అని నేను బలంగా నమ్ముతాను” అని పవన్ పేర్కొన్నారు.
“నన్ను తెలంగాణలో తిరగనివ్వం, రానివ్వం అని ఎవరైతే వ్యాఖ్యలు చేశారో.. వారికి మాత్రమే ‘మీ జాగీరా’ అని ప్రశ్నించాను తప్ప, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు” అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణపై తనకున్న ప్రేమ, అక్కడి యువత సాగించిన పోరాటాలపై తనకున్న మమకారం ఎప్పటికీ పోదన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ప్రస్తావనః బుధవారం అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించి, ఆయన కాంస్య విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించారు తప్పితే, అది ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషం కిందకు రాదని పవన్ గుర్తుచేశారు.
ఆయన తన జీవితంలో ఎప్పుడూ పక్క రాష్ట్రం వారిని తమ రాష్ట్రంలోకి రావొద్దని, తిరగనివ్వబోమని చెప్పలేదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం ముఖ్యం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.







