- సామాన్యులు కడుతున్నప్పుడు కార్పొరేట్ సంస్థలకెందుకు మినహాయింపు?
Pawan Kalyan Serious On Corporate Tax Evasion | పంచాయతీలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ.. పన్నుల చెల్లింపుల్లో మాత్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు, పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
పన్నుల చెల్లింపులో ప్రతి సంస్థా బాధ్యతాయుతంగా, పారదర్శకతతో వ్యవహరించినప్పుడే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.
పన్ను ఎగవేతల వల్ల రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశ్రమలు, విద్యాసంస్థల పన్ను ఎగవేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ పన్నులు కట్టని పెద్ద సంస్థల తీరును తప్పుబడుతూ నిలదీశారు.
“దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, కేవలం చేపల వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులు, దిగువ మధ్యతరగతి సామాన్య ప్రజలు సైతం ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారు. మరి అలాంటప్పుడు వందల కోట్ల టర్నోవర్ ఉండే పెద్ద పెద్ద విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులు కట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నాయి?” అని ఆయన అధికారుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రూ.160 కోట్ల బకాయిల లెక్కలివే!
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిల వివరాలను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా బహిరంగపరిచారు. ఒక్క ‘ఆంధ్ర పేపర్ మిల్’ సంస్థే ప్రభుత్వానికి రూ.13 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు తక్కువలో తక్కువగా రూ.115.57 కోట్లు ఉండగా.. ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి రూ.45 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.
మొత్తంగా రూ.160 కోట్ల మేర పన్నులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి రావాల్సిన ఈ రూ.160 కోట్ల బకాయిల్లో కేవలం సగం డబ్బును ఖర్చు చేసినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫిల్టర్ బెడ్లను (తాగునీటి శుద్ధి కేంద్రాలు) అద్భుతంగా బాగు చేయవచ్చని, వాటి నిర్వహణా ఖర్చులకు ఇవి సరిపోతాయని పవన్ కళ్యాణ్ అధికారులకు వివరించారు. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.








