Monday 1st June 2026
12:07:03 PM
Home > క్రైమ్ > పెట్రోల్ బంక్ మోసం.. 45 లీటర్ల ట్యాంక్‌లో 52 లీటర్లు!

పెట్రోల్ బంక్ మోసం.. 45 లీటర్ల ట్యాంక్‌లో 52 లీటర్లు!

  • కాన్పూర్‌లో కొత్త కారు ఓనర్‌కు షాక్..
  • రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం!

Kanpur Petrol Pump Scam పెట్రోల్ పంపుల్లో జరుగుతున్న వినూత్న మోసాలకు సంబంధించిన ఒక విస్తుపోయే ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది.

కారు గరిష్ట ట్యాంక్ సామర్థ్యం కంటే అదనంగా పెట్రోల్ నింపినట్లు బిల్లు వేసి అడ్డంగా బుక్కయ్యారు అక్కడి పెట్రోల్ పంప్ నిర్వాహకులు.

బాధితుడు ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సదరు పెట్రోల్ బంక్‌లోని డిస్పెన్సింగ్ యూనిట్లపై విచారణకు ఆదేశించింది.

అసలేం జరిగిందంటే?
కాన్పూర్‌కు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల ఒక సరికొత్త ‘వోక్స్ వ్యాగన్ విర్చుస్’ (Volkswagen Virtus) కారును కొనుగోలు చేశారు. కారులో ఇంధనం దాదాపు అయిపోవడంతో, ఆయన స్థానిక పెట్రోల్ బంక్‌కు వెళ్లి ట్యాంక్ పూర్తిగా (టాప్-అప్) నింపాల్సిందిగా అక్కడి సిబ్బందిని కోరారు.

మొదట సిబ్బంది కారులో 41 లీటర్ల పెట్రోల్ కొట్టారు. అయితే రీడింగ్ మధ్యలో ఎందుకు ఆపారని చరణ్ సింగ్ ప్రశ్నించగా.. ఎక్కువ మొత్తంలో ఇంధనం నింపేటప్పుడు రెండు విడతలుగా కొట్టడం సాధారణమేనని సిబ్బంది కవర్ చేశారు. ఆ తర్వాత మిగిలిన ట్యాంక్ కూడా నింపేసి బిల్లు చేతిలో పెట్టారు.

పంప్ సిబ్బంది ఇచ్చిన బిల్లును చూసిన చరణ్ సింగ్‌కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఆ బిల్లులో మొత్తం 52 లీటర్ల పెట్రోల్ నింపినట్లు ఉంది. తన కారు గరిష్ట ట్యాంక్ కెపాసిటీనే కేవలం 45 లీటర్లు అయితే, 52 లీటర్లు ఎలా పడుతుందని ఆయన పంప్ సిబ్బందిని నిలదీశారు.

ఇదొక వ్యవస్థీకృత స్కామ్ అని అనుమానించిన చరణ్ సింగ్, ఏకంగా వోక్స్ వ్యాగన్ కార్ కంపెనీ ప్రతినిధిని నేరుగా పెట్రోల్ బంక్‌కే రప్పించారు. అక్కడికి చేరుకున్న కంపెనీ అధికారి.. ఈ కారు ట్యాంక్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం పట్టే అవకాశమే లేదని సాంకేతికంగా నిర్ధారించారు.

కంపెనీ ఆధారాలతో సహా దొరకడంతో పెట్రోల్ పంప్ యాజమాన్యం నీళ్లు నమలడం ప్రారంభించింది. స్థానిక కొలతలు-తూకాల (Weights and Measures) అధికారుల సహకారంతోనే ఈ పెద్ద నెట్‌వర్క్ మోసం సాగుతోందని ఆరోపిస్తూ చరణ్ సింగ్ అధికారికంగా ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం పెట్రోల్ మిషన్లలో ఏమైనా రీగింగ్ లేదా ట్యాంపరింగ్ జరిగిందా అనే కోణంలో లోతైన దర్యాప్తు ప్రారంభించింది.

You may also like
ఢిల్లీ, ముంబైలపై భారీ ఉగ్ర కుట్ర భగ్నం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions