- కోయంబత్తూర్‌లో వెలసిన ‘ఫియర్‌లెస్ మైండ్స్’ పోస్టర్లు..
- బీజేపీ హైకమాండ్‌తో విభేదాలే కారణమా!
Annamalai Posters In Coimbatore | తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఫోటోతో కోయంబత్తూర్ వ్యాప్తంగా వెలసిన కొన్ని పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఆ పోస్టర్లపై “Fearless minds gave no limits” (భయం లేని మనసులకు పరిమితులు లేవు) అనే పవర్‌ఫుల్ కొటేషన్ ఉండటంతో.. అన్నామలై త్వరలోనే సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
కోయంబత్తూర్‌లో బీజేపీ రాష్ట్ర సెంట్రల్ కమిటీ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ పోస్టర్లు కలకలం రేపాయి. ప్రస్తుతం అన్నామలై విదేశాల్లో ఉండటంతో ఈ సమావేశానికి ఆయన హాజరుకాలేదు.
వరుసగా రెండుసార్లు ఆయన పార్టీ ముఖ్యాంశాల సమావేశాలకు దూరం కావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఆయన అభిమాన సంఘం ‘అన్నామలై అన్బు కూట్టం’ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సభ్యులను, కార్యవర్గాన్ని చురుగ్గా చేర్చుకోవడం ప్రారంభించింది.
కేంద్ర విధానంపై తిరుగుబాటు
ఈ పరిణామాలపై అన్నామలై ఇంకా స్పందించనప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ నిర్ణయాలపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ విభేదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మే 15, 2026న సీబీఎస్‌ఈ (CBSE) జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 9వ తరగతి విద్యార్థులకు జూలై 1, 2026 నుండి త్రిభాషా సూత్రాన్ని విధిగా అమలు చేయాలని ఆదేశించింది. నిజానికి గతంలో ఈ గడువును 2029-30 విద్యాసంవత్సరానికి నిర్ణయించారు.
ఈ ముందస్తు నిర్ణయంపై అన్నామలై ‘X’ (ట్విట్టర్) వేదికగా కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. ఇంత తక్కువ సమయంలో కొత్త భాషను నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల తమిళనాడు విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర విద్యాశాఖను డిమాండ్ చేశారు.
అన్నామలై రాజకీయ ప్రయాణంలో మార్పుకు కేవలం భాషా విధానమే కాదు, మరికొన్ని సమీకరణాలు కూడా తోడయ్యాయి. ఏఐఏడీఎంకేతో విభేదాలు: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ద్రవిడ ఐకాన్స్ సి.ఎన్. అన్నాదురై, జె. జయలలితలపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
దీంతో మిత్రపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) ఒత్తిడి మేరకే ఆయన్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారనే టాక్ ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ట్వీట్ చేస్తూ.. “తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది, రాజకీయ చలనం వేగవంతమైంది” అంటూ మరింత నెయ్యి పోశారు.
ప్రస్తుతం ఈ ఊహాగానాలు పీక్స్‌కి చేరిన వేళ.. అన్నామలై విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో అత్యవసరంగా భేటీ కానున్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ భేటీ తర్వాతే అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేక బీజేపీలోనే కొనసాగుతారా అనే దానిపై పూర్తి క్లారిటీ రానుంది.








