Monday 1st June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జెన్ జీ యువతే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ‘సేనా గళం’!

జెన్ జీ యువతే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ‘సేనా గళం’!

Sena Galam
  • కుళ్ళు, కుతంత్రాల బూర్జువా రాజకీయాలకు చెక్!
  • మంగళగిరిలో డెసిషన్!

Sena Galam Committee | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు మరియు సామాజిక సామరస్యమే ధ్యేయంగా జనసేన పార్టీ సరికొత్త వేదికను సిద్ధం చేసింది.

నవతరం ఆలోచనలు, ముఖ్యంగా ‘జెన్ జీ’ (Gen Z) యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా ‘సేనా గళం’ (Sena Galam) పేరిట పార్టీలో ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం మరియు పార్టీల వ్యూహాలపై పవన్ కళ్యాణ్ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 “ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి.. రెడ్లు, కమ్మవారు విమర్శిస్తే ఆయా సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి” అనే కుళ్ళు, కుట్రలతో కూడిన బూర్జువా పంథాలోనే ప్రస్తుత రాజకీయ పార్టీలు, రాజకీయవాదులు మునిగితేలుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా దుయ్యబట్టారు.

నవతరం కోరుకునే రాజకీయం..
నేటి తరం మరియు జెన్ జీ యువత ఆలోచనలు ఈ కుల రాజకీయాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. నేటి యువతరం ఎటువంటి కుతంత్రాలు లేని, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన రాజకీయాలను కోరుకుంటోందని ఆయన విశ్లేషించారు.

 ఈ నేపథ్యంలోనే యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా ‘సేనా గళం’ ప్రత్యేక కమిటీని రంగంలోకి దించుతున్నట్లు జనసేనాని వెల్లడించారు.

ఈ కమిటీ ప్రధానంగా సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, బాధ్యతాయుతమైన రాజకీయాలను ప్రోత్సహించడం మరియు రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం నిరంతరం పనిచేస్తుంది.

సంప్రదాయ రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా, కేవలం ప్రజాస్వామ్య బద్ధంగా, విలువలతో కూడిన సరికొత్త చర్చను ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ ‘సేనా గళం’ వేదికగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions