Monday 1st June 2026
12:07:03 PM
Home > తాజా > ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్!

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్!

Jagtial Thar Car Accident | డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ చూడటం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో నిరూపించే ఒక విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఒక మహీంద్రా థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే జలసమాధి అవ్వగా.. మరో ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన అరుణ్, అశ్విన్, వినేశ్ అనే ముగ్గురు స్నేహితులు ఆదివారం సాయంత్రం తమ థార్ (Thar) కారులో బయటకు వెళ్లారు.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్‌లో చూస్తూ అరుణ్ కారు నడిపినట్లు తెలుస్తోంది.

మ్యాచ్ ఉత్కంఠలో పడి డ్రైవింగ్‌పై దృష్టి పెట్టకపోవడంతో, కారు జగిత్యాల రూరల్ మండలం మొరపెల్లి గ్రామం వద్దకు రాగానే అదుపుతప్పి నేరుగా రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది.

కారు బావిలో పడిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు.

కారు నీటిలో మునిగిపోతున్న తరుణంలో.. కారులో ఉన్న వినేశ్, అశ్విన్ లు అత్యంత సాహసంతో, అతి కష్టం మీద డోర్లు తీసుకుని బయటకు ఈదుకుంటూ వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

 అయితే కారు నడుపుతున్న అరుణ్ మాత్రం సీట్ బెల్ట్ వల్ల లేదా కారు లోపల చిక్కుకుపోవడం వల్ల నీటిలోనే మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది (Rescue Team) ఘటనా స్థలానికి చేరుకుని సుదీర్ఘ శ్రమ అనంతరం బావిలో నుండి అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు. స్నేహితులతో సరదాగా వెళ్లిన యువకుడు శవమై తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions