- గో బ్యాక్ ఆంధ్రా’ ఉద్యమం వస్తుందని హెచ్చరిక!
MLA Anirudh Reddy Comments on Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దమ్ముంటే ఆంధ్రా పోలీసులు తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సెంటిమెంట్‌ను రాజేసేలా అనిరుధ్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వస్తే ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుందని, మళ్లీ ‘గో బ్యాక్ ఆంధ్రా’ ఉద్యమం మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.
ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులందరూ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారని, మరి అలాంటప్పుడు అసలు అమరావతి నిర్మాణం అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
అమరావతికి ఖర్చు చేసే డబ్బులను తెలంగాణకు ఇస్తే, జడ్చర్లలో ఐదు వేల ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
పవన్ కళ్యాణ్‌పై ‘ప్యాకేజీ’ వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని విమర్శిస్తూ అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చారు కాబట్టే ఆయన ఇప్పుడు కూటమిలో కొనసాగుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
భవిష్యత్తులో ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గనుక ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేస్తే.. పవన్ కళ్యాణ్ కూటమిని వీడి వైసిపితో జట్టు కట్టే అవకాశం కూడా ఉందంటూ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర సంచలన వ్యక్తం చేశారు.







