- నిఘా కోసం RTGS తరహా కంట్రోల్ రూమ్!
AP Deputy CM Godavari Pushkaralu Action Plan | గోదావరి పుష్కరాల చారిత్రాత్మక వేడుకలను అత్యంత పవిత్రంగా, కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట రూపొందించిన పక్కా కార్యాచరణ ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు.
గోదావరి నదిలోకి ఎలాంటి కాలుష్య కారక వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా నిరోధించడమే ఈ భారీ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.
6 జిల్లాలు.. 262 పంచాయతీలపై ప్రత్యేక ఫోకస్..
పుష్కరాల నిర్వహణ పరిధిలోకి వచ్చే ఆరు జిల్లాల పరిధిలో ఉన్న 262 గ్రామ పంచాయతీలను వంద శాతం మురుగురహితంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ నిఘా:
పారిశ్రామిక కాలుష్యం, నగరాలు మరియు గ్రామాల మురుగునీటి నిర్వహణను నిరంతరం ట్రాక్ చేయడానికి వీలుగా ఆర్టీజీఎస్ (RTGS) తరహా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ (Live Monitoring) చేపట్టాలని ఆయన సూచించారు.
టాస్క్ ఫోర్స్‌కు పర్యవేక్షణ బాధ్యతలు:
ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌కు (High-Level Task Force) ఈ మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
నిధుల వినియోగంపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలుః
ఈ పవిత్ర యజ్ఞంలో నిధుల కొరత రాకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
మురుగు నివారణా చర్యల కోసం అవసరమైతే వీబీ జీ రాం జీ నిధులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు, మరియు కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భక్తులకు క్లీన్ పుష్కరాలు..
ఈ సరికొత్త పర్యవేక్షణా వ్యవస్థల ద్వారా పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.







