- సీఎం సుబెందు అధికారి “డిటెక్ట్-డిలీట్-డిపోర్ట్” యాక్షన్ ప్లాన్ షురూ..
- సరిహద్దుల్లో హై అలర్ట్!
West Bengal Illegal Immigrants Crackdown | పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులపై నూతనంగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
దేశ భద్రతకు ముప్పుగా మారిన అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి సుబెందు అధికారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “డిటెక్ట్-డిలీట్-డిపోర్ట్” (గుర్తించడం-తొలగించడం-దేశం దాటించడం) విధానాన్ని అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా అమలు చేస్తోంది.
సరిహద్దుల్లో చొరబాటుదారుల గుర్తింపు..
రాష్ట్ర హోం మరియు పర్వత ప్రాంతాల వ్యవహారాల శాఖకు చెందిన ‘ఫారిన్ వింగ్’ ఆదేశాల మేరకు సరిహద్దు జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని స్వరూప్‌నగర్ వద్ద గల హకీంపూర్ చెక్ పోస్ట్ వద్ద దాదాపు 50 మంది చొరబాటుదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు నిలిచి ఉండటం సరిహద్దుల్లో ఉత్కంఠ రేపుతోంది.
మరో 350 మంది అక్రమ వలసదారులను ప్రస్తుతం అధికారులు విభిన్న హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. వీరందరినీ త్వరలోనే దేశం దాటించేందుకు (డిపోర్ట్) అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు.
రాష్ట్రంలో అక్రమ వలసదారులను తాత్కాలికంగా ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించిన వెంటనే తరలించడానికి వీలుగా వివిధ జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్లు, డిటెన్షన్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
సీఎం సుబెందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు సరిహద్దు రాష్ట్రాల్లో చొరబాటుదారులకు గట్టి హెచ్చరికగా మారాయి.







