Friday 29th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. కారణం ఏంటంటే!

భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. కారణం ఏంటంటే!

  • 20 ఏళ్లలో తొలిసారి ఎగుమతులకు బ్రేక్!

Japan Bans Indian Mangoes | అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ వ్యవసాయ ఎగుమతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి వచ్చే ప్రీమియం రకాల మామిడి పండ్ల దిగుమతులను జపాన్ దేశం తాత్కాలికంగా నిలిపివేసింది.

భారతీయ ఎగుమతి శుద్ధి కేంద్రాలలో కీటకాల నియంత్రణ (Pest-Control) పద్ధతులలో లోపాలు ఉన్నట్లు జపాన్ క్వారంటైన్ అధికారులు గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం.

ఈ సస్పెన్షన్ కారణంగా భారత్ నుంచి జపాన్‌కు ఎగుమతి అయ్యే అత్యంత ప్రతిష్టాత్మక రకాలైన అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, మరియు మన తెలుగు రాష్ట్రాల గర్వకారణం ‘బంగినపల్లి’ (Banganapalli) మామిడి రకాల రవాణా నిలిచిపోయింది.

వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) లో లోపాలు..
‘ఎకనామిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ ఇన్‌స్పెక్టర్లు భారతదేశంలోని వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) ఫెసిలిటీస్‌ను తనిఖీ చేశారు. మామిడి పండ్లను ఎగుమతి చేసే ముందు వాటిలో ఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వంటి కీటకాలు లేకుండా శుద్ధి చేసే బాధ్యత ఈ కేంద్రాలదే.

అయితే, ఈ ప్రక్రియలో కొన్ని కార్యాచరణ లోపాలను జపాన్ అధికారులు గుర్తించారు. జపాన్ దేశం కీటకాలు, తెగుళ్ల విషయంలో ‘జీరో-టాలరెన్స్’ పాలసీని అనుసరిస్తుంది.

ఈ నేపథ్యంలో, మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (Inspection Certificates) ఉన్న ఏ ఒక్క భారతీయ మామిడి షిప్‌మెంట్‌ను కూడా అంగీకరించబోమని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఇంపోర్టర్లకు స్పష్టం చేసింది.

20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్..
భారతీయ మామిడిపై జపాన్ ఇలాంటి పెద్ద ఆంక్షలు విధించడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. గతంలో ఫ్రూట్ ఫ్లైస్ సమస్య కారణంగా విధించిన నిషేధాన్ని, భారత్ తన ట్రీట్‌మెంట్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్ చేశాక 2006లో జపాన్ ఎత్తివేసింది.

మహారాష్ట్ర అల్ఫోన్సో బెల్ట్‌ కు దెబ్బ..
ఎల్ నినో వాతావరణ మార్పులు, తీవ్రమైన ఎండల కారణంగా ఇప్పటికే మహారాష్ట్రలోని అల్ఫోన్సో బెల్ట్ రైతులు దాదాపు 85 నుండి 90 శాతం మేర పంట నష్టాన్ని చవిచూశారు. ఇలాంటి సంక్షోభంలో ఈ నిషేధం మరింత ఆందోళన కలిగిస్తోంది.

జపాన్ మనకు అతిపెద్ద మామిడి మార్కెట్ కాకపోయినప్పటికీ, ఈ నిర్ణయం వల్ల ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా భారతీయ క్వాలిటీ-కంట్రోల్ ప్రమాణాలపై నిఘా పెరిగే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు భయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి భారత అధికారులు, జపాన్ రెగ్యులేటర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions