Kavitha On Bandi Sanjay’s Son Controversy | తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బుధవారం ప్రెస్ మీట్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రధాని మోడీ ఆంధ్రాకు కొమ్ముకాస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘గురువు’ చంద్రబాబును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పారు. పోలవరం కోసం చంద్రబాబు ఐదుసార్లు వెళ్తే, రేవంత్ రెడ్డి కనీసం ఒక రివ్యూ కూడా చేయలేదు. మీ గురువును చూసి నేర్చుకోండి” అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలు గంభీరమైనవని, ఆయన దేశం దాటి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో బాధిత బాలిక ఫోటోలు బయటకు రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
“బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్ల ఆ అమ్మాయి జీవితం ప్రమాదంలో పడింది. ఫోటోలు పోస్ట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి” అని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడినా గోదావరిలో పావు శాతం, కృష్ణాలో సగం నీళ్లు కూడా వాడుకోలేకపోతున్నామని, తాము అధికారంలోకి వస్తే ‘వాటర్ కమిషన్’ ఏర్పాటు చేసి ప్రతి గుంటకు నీరిస్తామని హామీ ఇచ్చారు.
నీట్ పేపర్ లీక్..
“దేశంలో పది రూపాయల డైపర్ లీక్ అవ్వడం లేదు కానీ, దేశ భవిష్యత్తును నిర్ణయించే నీట్ పేపర్ లీక్ అవుతోంది” అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని, ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహిస్తామని కవిత వెల్లడించారు.







