Raghav Chadha explains joining BJP | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను పార్టీ మారడంపై వస్తున్న విమర్శలు, సందేహాలకు సమాధానమిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఆప్ ఇప్పుడు పాత పార్టీలా లేదని, అక్కడ పని చేసే వాతావరణం లేదని ఆయన ఆరోపించారు.
“నేడు ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేసే వాతావరణం లేదు. అక్కడ మిమ్మల్ని పని చేయనివ్వరు.. కనీసం పార్లమెంటులో మాట్లాడనివ్వరు. ఇది నేను చూసిన పాత పార్టీ కాదు” అని చద్దా ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఆప్ వ్యవస్థాపక సభ్యుడినని, తన యవ్వనంలోని 15 ఏళ్ల కాలాన్ని ఈ పార్టీ కోసం రక్తం, చెమట ధారపోసి పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. కెరీర్ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
“నేను ఒక్కడినే కాదు, నాతో పాటు మరో ఆరుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఒకరు లేదా ఇద్దరు తప్పు కావచ్చు.. కానీ ఏడుగురు ఎంపీలు ఒకేసారి తప్పుడు నిర్ణయం తీసుకోరు కదా?” అని ఆయన ప్రశ్నించారు.
తనను తాను “తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని” గా అభివర్ణించుకున్నారు. భయం వల్ల కాకుండా, నిరాశ, అసహ్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పార్టీ మారిన మరుసటి రోజే రాఘవ్ చద్దా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు అన్‌ఫాలో చేయడం గమనార్హం.
జెన్-జీ (Gen Z) ఓటర్లలో తన పాపులారిటీ తగ్గకుండా చూసుకునేందుకే ఆయన ఈ వీడియో వివరణ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.










