Seethakka counters KCR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జగిత్యాల వేదికగా చేసిన విమర్శలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు నిధుల పంపిణీలో జరిగిన జాప్యాన్ని గణాంకాలతో సహా బయటపెడుతూ, కేసీఆర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
“కేసీఆర్ హయాంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒక్క రోజులో ఇచ్చిన చరిత్ర లేదు. నెలల తరబడి సాగదీసి చెల్లింపులు చేశారు. 2018 యాసంగిలో నిధులు ఇవ్వడానికి 161 రోజులు (దాదాపు 6 నెలలు) పట్టింది. పంట పండించడానికి కూడా అంత సమయం పట్టదు. అలాగే 2022-23 యాసంగిలో 148 రోజులు పట్టింది” అని ఆమె గుర్తు చేశారు.
తాము గత వానాకాలం సీజన్‌లో కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశామని సీతక్క స్పష్టం చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ చేసిన అప్పుల వల్లే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ పథకాన్ని ఎత్తేయాలన్న కుట్రతోనే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని, మహిళాలోకం అంతా దీనిని గమనిస్తోందని హెచ్చరించారు.
కేసీఆర్ ‘హైడ్రా’, ‘రైతు భరోసా’పై చేసిన విమర్శలకు కాంగ్రెస్ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తుండటంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.






