Monday 20th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ఆపరేషన్ సేఫ్ స్కూల్: రూ. 1.10 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తుల సీజ్!

ఆపరేషన్ సేఫ్ స్కూల్: రూ. 1.10 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తుల సీజ్!

vc sajjanar
  • విద్యాసంస్థల వద్ద విక్రయాలపై 567 కేసులు
  • పొగాకు ఉత్పత్తులే డ్రగ్స్ కు తొలిమెట్టు: నగర సీపీ వీసీ సజ్జనర్
  • విద్యార్థులు, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Tobacco products seized near schools | విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ లో భాగంగా ఈ నెల 18న విస్తృతంగా సోదాలు చేశారు.

పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై 567 కేసులను నమోదు చేశారు. సుమారు రూ. 1.10 కోట్ల విలువైన నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా శనివారం సాగిన సోదాల్లో జోన్ల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్ర నగర్ జోన్ లో 102, గోల్కొండలో 98 కేసులు నమోదయ్యాయి.

అదేవిధంగా ఖైరతాబాద్ లో 78, సికింద్రాబాద్ లో 64, జూబ్లీ హిల్స్ లో 54, శంషాబాద్ జోన్ పరిధిలో 52 కేసులను పోలీసులు నమోదు చేశారు.

విద్యార్థుల, యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై పోలీసులు కఠిన చట్టాలను ప్రయోగించారు. పట్టుబడిన ఉత్పత్తులు, దుకాణదారుల నేర తీవ్రతను బట్టి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA Act), భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్లు,  జువైనల్ జస్టిస్ (JJ) యాక్ట్ – సెక్షన్ 77 మరియు 79, ఈ-సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.

సుమారు 5 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఏకకాలంలో సోదాల్లో పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), రిజర్వ్ పోలీస్ మరియు ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

డ్రగ్స్ రహిత సమాజం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్ ను ప్రారంభించామని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు.

విద్యాసంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సులభంగా లభించడం వల్ల విద్యార్థులు, యువత తొలుత సరదాగా వాటికి ఆకర్షితులవుతున్నారని అన్నారు.

ఆ నికోటిన్ కు క్రమేణా అలవాటు పడి, చివరకు డ్రగ్స్, గంజాయి వంటి తీవ్రమైన వ్యసనాల వైపు మళ్లే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందన్నారు.

“డ్రగ్స్ మహమ్మారికి పొగాకు ఉత్పత్తులే ముఖద్వారం. ఈ ప్రమాదకరమైన గొలుసుకట్టును ప్రాథమిక దశలోనే తుంచేయాలన్నదే ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ ముఖ్య ఉద్దేశం.

యువత భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ తనిఖీలు ఇక్కడితో ఆగిపోవు.. విద్యార్థులు, యువత భద్రత కోసం ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయి,” అని అన్నారు.

విద్యాసంస్థల పవిత్రతను దెబ్బతీస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా, హైదరాబాద్ నగర పోలీసులు ఇకపై ఈ నియమాన్ని నిరంతరం అమలు చేస్తూనే ఉంటారని చెప్పారు.

ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా, సోదాల సమయంలో విద్యాసంస్థల సమీపంలోని అనేక పాన్ షాపులు, టీ షాపులు, ఇతర దుకాణాలు కూడా పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయని, తద్వారా ఆ ప్రాంతంలో ప్రయాణించే పిల్లలు మరియు మహిళలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గమనించామని వివరించారు.

అందువల్ల, ఏవైనా విద్యాసంస్థల సమీపంలో పనిచేస్తున్న దుకాణ యజమానులందరూ COTPA చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే దుకాణాల పరిసరాల్లో పరిశుభ్రత మరియు శుభ్రతను పాటించాలన్నారు.

ఇంకా, నగరంలో ఎక్కడైనా ఏ దుకాణదారుడైనా మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే, వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని సెక్షన్ 77 కింద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.

సామాజిక బాధ్యతగా ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, ఈ-సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని కోరారు.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) ఫోన్ నంబర్ 8712661601 కు సమాచారం అందించాలని సూచించారు.

You may also like
ఏటీఎం కేంద్రాలే టార్గెట్.. ‘ఫేక్ ఫోన్ పే’ యాప్‌తో నిలువు దోపిడీ!
తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. అడ్డుకున్న సాహసవంతులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions