AP Police special leave orders | నిత్యం కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వారి పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు.
పండగలు, సెలవుల్లోనూ విధుల్లో ఉండే పోలీసులు, కనీసం తమ జీవితంలోని ఈ ముఖ్యమైన రోజుల్లో కుటుంబంతో గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది.
అదే విధంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రక్రియలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి, పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది.
మే 1వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా ‘నిధి’ (NIDHI) పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ స్పష్టం చేశారు.






