Iran War Effect On LPG | సుదూర తీరాల్లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ (Iran – Israel War) యుద్ధం భారత్ పై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హోటల్ పరిశ్రమను ఎఫెక్ట్ చేస్తోంది.
ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గం మూతపడటంతో దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
ముంబైలోని దాదాపు 20% హోటళ్లు ఇప్పటికే మూతపడగా, సరఫరా మెరుగుపడకుంటే మరో రెండు రోజుల్లో 50% రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని ‘ఆహార్’ (AHAR) హెచ్చరించింది. బెంగళూరులోని ప్రసిద్ధ ‘విద్యార్థి భవన్’ వంటి హోటళ్లు కూడా గ్యాస్ నిల్వలు లేక కార్యకలాపాలు తగ్గించుకున్నాయి.
చెన్నై, లక్నో, పుణే వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారత్ తన అవసరాల్లో 60% పైగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 90% హోర్ముజ్ జలసంధి గుండానే రావాలి. ప్రభుత్వం ప్రస్తుతం గృహ వినియోగదారులకు, ఆసుపత్రులకు ప్రాధాన్యతనిస్తూ ‘అవసర వస్తువుల చట్టాన్ని’ ప్రయోగించింది.
దీంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయిందని హోటల్ అసోసియేషన్లు వాపోతున్నాయి. నిల్వలను అరికట్టేందుకు బుకింగ్ గడువును పెంచడంతో పాటు, గృహ సిలిండర్‌పై ₹60, కమర్షియల్ సిలిండర్‌పై ₹114.5 చొప్పున ధరలను పెంచారు. ఫలితంగా త్వరలోనే హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.






