Telangana Panchayati Elections | తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు చిత్ర విచిత్రంగా సాగుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్ గా పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వినూత్న ప్రచారం జరుగుతుంది. ఇది కాస్తా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న తన భార్యను గెలిపిస్తే ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానని భర్త హామీ ఇచ్చారు. వీటితో పాటే వార్డు అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంటానన్నారు.
ఈ మేరకు ప్రత్యేకంగా తీసిన వీడియోతో ప్రచార వేగాన్ని పెంచారు. రఘోత్తంపల్లి గ్రామంలోని ఆరవ వార్డు మెంబర్ గా శివానీ పోటీ చేస్తున్నారు. ఆమె భర్త శ్రీకాంత్ వృత్తిరీత్యా బార్బర్. ఈ నేపథ్యంలో తన భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే రాబోయే ఐదేళ్ల పాటు వార్డులోని పురుషులకు ఉచితంగానే కటింగ్ షేవింగ్ చేస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.










