Kalthi Kallu in Kukatpally | హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు తాగి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది.
కూకట్పల్లి లోని ఓ కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి మంగళవారం రాత్రి 19 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పంజాగుట్ట నిమ్స్, గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందారు.
బతుకుదెరువు కోసం ఆయన వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చారు. కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి కూడా మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితుల్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందరూ ఒకే రకమైన లక్షణాలతో భాదపడుతున్నారని, ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగిందని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఘటనపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే.. బాధ్యులెంతటి వారైనా వదిలేదు లేదని స్పష్టం చేశారు. బాధ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, కల్లు డిపోలను కూడా సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు.










