Pak minister’s open threat to India | జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.
ఇదే సమయంలో 1960ల్లో కుదిరిన సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నిర్ణయం పాక్ పై భవిష్యత్ లో తీవ్ర ప్రభావం చూపించనుందని విశ్లేషణలు వస్తున్నాయి. దింతో పాక్ నాయకులు విషం వెళ్ళగక్కుతున్నారు. సింధూ నది నీళ్లు ఆపితే భారత నదుల్లో రక్తం పారుతుందని పలువురు నాయకులు మరియు పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు పిచ్చి బెదిరింపులకు దిగుతున్నారు.
ఈ క్రమంలో పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. భారత్‌పై అణు ఆయుధ దాడికి సిద్ధమన్నారు. హనీఫ్ అబ్బాసి శనివారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ వద్ద గౌరీ, షాహీన్, ఘజన్వీ క్షిపణులతో సహా 130 అణు ఆయుధాలు ఉన్నాయని ఇవి కేవలం భారత్ కోసమే ఉద్దేశించినవని తెలిపారు.
భారత్ నీటి సరఫరాను నిలిపివేస్తే, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఆయుధాలు కేవలం ప్రదర్శన కోసం కాదని, అవి దేశవ్యాప్తంగా రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచినట్లు, ఒకవేళ భారత్ రెచ్చగొట్టినట్లయితే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
కేవలం రెండు రోజులు పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో పడినట్లు, ఒకవేళ 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే భారత విమానయాన సంస్థలు దివాళా తీస్తాయన్నారు.









