- 35 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్న బాధితుడు!
UP SI Suspended For Stealing Money | దొంగలను వెంటాడి పట్టుకోవాల్సిన పోలీస్ అధికారే స్వయంగా దొంగగా మారిన అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్ క్యాబిన్ నుండే డబ్బులు దొంగిలించి పారిపోతుండగా.. సదరు డ్రైవర్ ప్రాణాలకు తెగించి మరీ పోలీస్ వాహనాన్ని 35 కిలోమీటర్ల మేర సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
లిఫ్ట్ అడిగి.. చేతివాటం ప్రదర్శించి..
పోలీసుల కథనం ప్రకారం.. మనీష్ అనే ట్రక్ డ్రైవర్ తన వాహనంతో గాటంపూర్ నుండి హమీపూర్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో యూనిఫాంలో ఉన్న ఎస్సై (సబ్ ఇన్‌స్పెక్టర్) గిరీష్ మిశ్రా ట్రక్ డ్రైవర్‌ను లిఫ్ట్ అడిగాడు.
ఖాకీ యూనిఫాంలో ఉన్న అధికారి కావడంతో మరుక్షణం ఆలోచించకుండా మనీష్ గౌరవంతో ఆ ఎస్సైని తన ట్రక్ క్యాబిన్ లోకి ఎక్కించుకున్నాడు.
ట్రక్ అలియాపూర్ టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే.. ఎస్సై మిశ్రా హడావిడిగా కిందకు దిగి, అక్కడ సిద్ధంగా ఉన్న తన సొంత పోలీస్ వాహనంలో ఎక్కి వెళ్లిపోయాడు.
ఎస్సై ప్రవర్తనపై అనుమానం వచ్చిన డ్రైవర్ మనీష్ వెంటనే ట్రక్ క్యాబిన్ లో తనిఖీ చేయగా, అక్కడ దాచి ఉంచిన రూ. 20,000 మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు.
Read Also: సినీ ఇండస్ట్రీలో పనిగంటల వివాదం.. దీపికకు కాజల్, కంగనా మద్దతు!
35 కిలోమీటర్ల హైవే ఛేజింగ్ – ఎస్సై సస్పెన్షన్..
డబ్బులు పోయాయని గ్రహించిన ట్రక్ డ్రైవర్ ఏమాత్రం అధైర్యపడకుండా ఎస్సై ప్రయాణిస్తున్న వాహనాన్ని తన ట్రక్‌తో వేగంగా వెంబడించాడు.
సుమారు 35 కిలోమీటర్ల మేర హైవేపై చాకచక్యంగా ఛేజ్ చేసిన అనంతరం, యమునా నది వంతెన (Yamuna River Bridge) వద్ద ఎస్సై వాహనాన్ని అడ్డుకొని ఆపాడు.
కిందకు దిగిన ట్రక్ డ్రైవర్ తన రూ. 20 వేలు తిరిగి ఇచ్చేయాలని ఎస్సైని గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎస్సై తప్పును ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్.. ఎస్సైపై చేయి చేసుకుని, ఆయన యూనిఫాం జేబులో దాచి ఉంచిన తన రూ. 20 వేల నగదును బలవంతంగా లాక్కున్నాడు. హైవేపై జరుగుతున్న ఈ రభసను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఎస్సై గిరీష్ మిశ్రాను అదుపులోకి తీసుకుని కోట్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డిపార్ట్‌మెంట్‌కు తీవ్ర అవమానం తెచ్చిన సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.







