Kishan Reddy Visits Anganwadi | దేశంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను గురువారం పరిశీలించారు. అంగన్వాడీ గ్రాడ్యుయేషన్ లో భాగంగా చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో ప్రభుత్వ సొంత భవనాల్లో ఉన్న కేంద్రాల్లో టీవీలు, ఫ్యాన్లు, ఫ్లోరింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపడుతున్నామన్నారు.
చిన్న పిల్లలకు ఆటపాటలతో పాటు పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. బస్తీ దవాఖానలకు కేంద్రమే బడ్జెట్ ఇస్తోందని గుర్తు చేస్తూ, సికింద్రాబాద్ పరిధిలోని పీహెచ్‌సీలకు (PHCs) అవసరమైన వైద్య పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడుతూ “కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు కదా.. రెండేళ్లవుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని ప్రశ్నించారు.
ఉచిత బస్సు పథకం వల్ల పనిభారం పెరిగిన కార్మికుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు.







