Police Case On Akbaruddin | పోలీసులకు వార్నింగ్ ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ.(Akbaruddin Owaisi)
మంగళవారం రాత్రి చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు అక్బరుద్దీన్.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన సంతోష్ నగర్ సిఐ శివచంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార సమయం ముగిసిపోతుందని, క్యాంపెన్ ను ముగించాలని కోరారు.
సిఐ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ కోపోద్రిక్తులు అయ్యారు.
మీకు సమయం తేలికపోతే నా దగ్గర వాచ్ ఉందని అందులో టైం చూసుకోండి అంటూ ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా స్టేజి కింద ఉన్న పోలీసుల వద్దకు వచ్చి ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని, తాను ఖచ్చితంగా మాట్లాడి తీరుతా అంటూ కన్నెర్ర చేసారు.
తనను ఆపే ధైర్యం ఎవరికి లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక్క సైగ చేస్తే పోలీసులు ఇక్కడ నుండి పరుగెడుతరంటూ హెచ్చరించారు ఒవైసి.
పోలీసులకు వార్నింగ్.. ఒవైసి పై నమోదైన కేసు!పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదైంది.
సంతోష్ నగర్ లోని పోలీస్ స్టేషన్లో ఆయన పై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అక్బరుద్దీన్ పై కేసు ఫైల్ చేశారు.
ఐపీసీలోని 353 మరియు ఇతర సెక్షన్ల కింద కేసును బుక్ చేసినట్లు తెలిపారు డీసీపీ రోహిత్ రాజు. కాగా తనపై నమోదైన కేసుపై స్పందించారు అక్బరుద్దీన్.
ఒకవేళ రాత్రి 10.01 నిమిషాలు దాటితే ప్రచారాన్ని అడ్డుకునే అధికారం పోలీసులకు ఉందని, కానీ ఇంకా ఐదు నిమిషాల సమయం ఉన్నా ప్రచారాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.