Sunday 13th July 2025
12:07:03 PM
Home > తాజా > సిరివెన్నెల జయంతి: ‘తెలుగు పాట దినోత్సవం’ జరుపుకొందాం!

సిరివెన్నెల జయంతి: ‘తెలుగు పాట దినోత్సవం’ జరుపుకొందాం!

sirivennela

Sirivennela Sitaramasastry Jayanthi | ఆధునిక సాహిత్య చరిత్రలో తెలుగు సినిమా పాటలకు ఊపిరి పోసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. సినీ సాహిత్యానికి కొత్త భాష్యం నేర్పిన ఆత్రేయ, ఆరుద్ర, సినారే, వేటూరి, సిరివెన్నెల పంచభూతాల్లాంటి వారు. తెలుగు సినిమా పాటల ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే అందులో కచ్చితంగా ప్రస్తావించాల్సిన పేర్లు ఇవి. అసలు ఈ పేర్లు లేకుండా తెలుగు సినిమా సాహిత్య చరిత్రే లేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఈ పాటల పంచభూతాల్లో ఒకరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి 70వ జయంతి నేడు. తెలుగు సినిమా పాటల రచనలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిది ఒక ప్రత్యేక స్థానం. సిరివెన్నెల సినిమాతో తన పాట ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆయన ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. తెలుగు సాహిత్య వినీలాకాశంలో సిరిసంపదల వెన్నెల జాబిలి ఆయన.

సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటలు ప్రతి మనసును తడిమేస్తాయి. ఆ పాట విన్న ప్రతి మెదడును ఆలోచింపజేస్తాయి. ఆయన రాసిన ప్రతి అక్షరం ఓ భావ గీతం. ప్రతి సాహిత్యం ఓ జీవన రాగం. మూడు వేలకు పైగా పాటలతో తెలుగు సినిమాకు స్వర్ణ సౌరభం అద్దిన గేయకారుడు. పద్మశ్రీ సహిత అనేక పురస్కారాలు ఆయన సాహితీ సామ్రాజ్యానికి సాక్ష్యం. ప్రేమ, విరహం, త్యాగం, సామాజిక అంశాలు అన్నింటినీ అక్షరాల్లో అల్లిన మహాకవి సిరివెన్నెల.

సీతారామ శాస్త్రి పాట అంటే కేవ‌లం వినసొంపైన స్వరాలు మాత్రమే కాదు. ఎంద‌రో సంగీత ప్రియులను సాహిత్యాభిలాషులుగా మార్చిన అత్యంత విలువైన అరుదైన కవి, ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

పాటకి సంగీతం ప్రాణం అయితే సాహిత్యం ఊపిరి అనిపించేలా ఆయన రాసిన గీతాలది తెలుగు సినీరంగంలో ప్రత్యేక స్థానం.

సమకాలీన పాటల రచయితలకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక తెలుగు గ్రంథాలయం లాంటి వారు.

ఆధునిక గాయకులకు ఆయన సాహిత్యం ఒక పరిశోధన గ్రంథం లాంటిది. సిరివెన్నెల రాసిన పాటలు ఆలపిస్తేనే ఒక పాటగాడు పరిపూర్ణ గాయకుడు అవుతాడు అని అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు.

సీతారామ శాస్త్రి పాటల్ని ఒకదానితో మరొకటి పోల్చలేం. ఆయన రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం. ఒక పాట అందరికీ అర్థమవుతుంది. మరో పాట అందరికీ అర్థం తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగిస్తుంది.

రుద్రవీణ చిత్రంలో..

“స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు..
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు..
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే..
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే..”
అందరికీ అర్థమయ్యేలా రాస్తారు..

కంచె సినిమాలో..

“నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం
మృదులాలస స్వప్నాలస హృత్ కపోత పాతం..
పృథు వ్యధార్థ పృథ్విమాత నిర్ఘోషిత చేతం..
నిష్టుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విషబీజోద్భూతం ఈ విషాద భూజం” అంటూ అందరూ అర్థం తెలుసుకోవాలనిపించేలా వినిపిస్తారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరో ప్రత్యేకత ఏంటంటే.. పాట ఏ సందర్భం అయినా, సన్నివేశం ఏదైనా.. ఆ పాత్రల్లోకి దూరిపోతారు. ఆ సన్నివేశంలో తానే ఉన్నట్లు ఊహించుకొని రాసేస్తారు.

యుగళ గీతానికి, ప్రేమ కావ్యానికి పాతికేళ్ల కుర్రాడిలా మారిపోతారు.

విరహ వేదనకి, హృదయ రోదనకి విఫల ప్రేమికుడవుతారు.

చైతన్య గళానికి, స్ఫూర్తి గేయానికి అభినవ శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాడు ఈ సీతారాముడు..

‘విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ సృష్టికర్త పాత్రనై ఈ కవిత్వాన్ని రాసిన నేనే.. వీణానాదంగా మారి అందరికీ వినిపిస్తున్నానంటారు..

‘జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం’ అంటూ అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపులోనూ జీవన నాదం ఉందంటారు..

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందమా’ అంటూ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న సమాజాన్ని వెక్కిరిస్తారు..

‘నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు’ అంటూ సూర్యుడిని సైతం మేలుకొల్పుతారు.

‘తన దరికిరాని వనాల కోసం వసంతం తానే తరలిరాదా’ అని ఆశ్చర్యపరుస్తారు.

ఈ సిగ్గులేని జనాన్ని నిగ్గుదీసి అడగు’ అని నిలదీస్తారు.

‘ఆశలు రేపినా, ఆడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా’ అంటూ వాస్తవాన్ని గుర్తు చేస్తారు.

‘ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో.. ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో’ అంటూ ప్రేమకు తనదైన నిర్వచనం ఇస్తారు.

 ‘నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ.. నిన్ను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదని’ ప్రియురాలి మనసు దోచేస్తారు.

‘శత్రువులు నీలోని లోపాలే.. స్నేహితులు నీకున్న ఇష్టాలే.. రుతువులు నీ భావ చిత్రాలే’ అంటూ నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోమంటారు.

‘రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం’ అంటూ మనిషిలో వచ్చిన మార్పును వివరిస్తారు.

‘ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా’ అని ప్రతి చిన్నదానికి చింతలెందుకు అని ప్రశ్నిస్తారు.

‘ఎల్లలతో పుడమి ఒళ్లు నిలువెల్లా చీలిందా’ అంటూ ఆవేదన చెందుతూనే

‘ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపు అవుదాం’ అని పిలుపునిస్తారు.

అన్నింటికీ మించి

‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అంటూ తత్వాన్ని బోధిస్తారు.

సిరివెన్నెల రాసిన సాహిత్య సముద్రంలో ఒక చెంచాడు నీళ్లంతటివే ఈ వాక్యాలు.  

సీతారామ శాస్త్రి మరణంతో సిరి’వెన్నెల’ కురవకపోవచ్చు.. కానీ,

ఆ ‘సిరా’వెన్నెల ఎప్పటికీ చెరిగిపోదు..

అందుకే ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పుట్టినతేదీని ‘తెలుగు పాట దినోత్సవం’గా జరుపుకొందాం. తెలుగు సినీ సాహిత్యాన్ని అలా గౌరవించుకుందాం.
ఏమంటారూ!

జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||

You may also like
anupam kher
ప్రభాస్ మూవీ.. గోడ దూకి షూటింగ్ కు వెళ్లిన సీనియర్ నటుడు!
harihara veera mallu
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions