Sunday 9th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి’

‘నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి’

Pawan Kalyan’s emotional post as Chiranjeevi wins UK Parliament honour | తన జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్.

సినీ, సేవా రంగాల్లో చేసిన విశేష కృషికి గాను మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు ఘనంగా సత్కరించి, జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. యూకే పార్లమెంటు అందించిన పురస్కారం అన్నయ్య కీర్తిని మరింత పెంచిందని పవన్ సంతోషం వ్యక్తం చేశారు.

‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు. యూకే పార్లమెంటు అన్నయ్యను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని పవన్ పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions