Dating App Crimes | రోజు రోజుకీ సైబర్ (Cyber Crimes) కేటుగాళ్ల నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో అమాయకులు బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా నోయిడాకు చెందిన వ్యక్తి డేటింగ్ యాప్ లో ఓ ఖిలేడీ లేడి మాటలు నమ్మి ఏకంగా రూ. 6.3 కోట్లు పోగొట్టుకున్నాడు.
నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విడాకులు తీసుకొని కొంత కాలం నుంచి ఒంటరిగా ఉంటున్న ఓ డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈక్రమంలో ఆ డేటింగ్ యాప్ లో ‘అనిత’ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది.
కొంత కాలానికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దల్జీత్ తనని పూర్తిగా నమ్ముతున్నాడని భావించిన అనిత ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే.. తక్కువ కాలంలో పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపింది. మూడు వెబ్సైట్ల పేర్లను సూచించి అందులో రూ.3.2 లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. గంటల వ్యవధిలోనే రూ. 24 వేలు లాభం వచ్చింది.
ఆ మొత్తాన్ని తిరిగి తన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దీంతో అనితపై అతడికి పూర్తి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె అసలు ప్లాన్ అమలు చేసింది. ఆమె సలహా మేరకు రూ.4.5 కోట్ల సేవింగ్స్ తో పాటు మరో రూ.2 కోట్లు లోన్ తీసుకొని విడతలవారీగా మొత్తం రూ.6.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే మళ్లీ వాటిని తిరిగి తన ఖాతాల్లోకి ట్రాన్స ఫర్ చేయడానికి వీలు కాలేదు.
పెట్టుబడిలో కేవలం 30శాతం మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చని మెసేజ్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే అనిత సూచించిన మూడు వెబ్సైట్లు డౌన్ అయిపోయాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన దర్జీత్ నోయిడా సెక్టార్-36 సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్వెస్టిగేషన్ లో అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది.