Next CJI Justice Suryakant | సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ 2025 నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.
దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సీజేఐగా నియమించే సంప్రదాయం ప్రకారం, జస్టిస్ గవాయ్ తన తర్వాత జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేశారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2) ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించినట్టు కేంద్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
తద్వారా 2025 నవంబర్ 24వ తేదీ నుంచి జస్టిస్ సూర్యకాంత్ నియామకం అమల్లోకి రానుంది. జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. దాదాపు 14 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగి, 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు.





