- అంబేద్కర్ జయంతి వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on constituency delimitation | భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి మహాత్మా గాంధీ ఒక కన్నైతే, బాబాసాహెబ్ అంబేద్కర్ మరో కన్ను అని కొనియాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారని ఆయన గుర్తు చేశారు.
గత పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“దళిత బిడ్డలు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా ఉండకూడదా? దళిత బిడ్డ స్పీకర్‌గా ఉంటే ఆయన్ని గౌరవించలేక అసెంబ్లీకి రాకుండా కొందరు అవమానిస్తున్నారు” అని విపక్షాలపై మండిపడ్డారు.
పేదలకు నాణ్యమైన విద్యనందించేందుకు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’, కులాల అంతరం తొలగించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రెండేళ్లలో అందించిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో అత్యధికం ఎస్సీ, ఎస్టీలకే దక్కాయని, 87 శాతం ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాలకే లభించాయని వివరించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దక్షిణాదిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
సీట్ల పెంపు కోసం ‘ప్రో రేటా’ (Pro-rata) పద్ధతిని అనుసరించాలని, దీని కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
“మేము అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుంటే, వెనక నుంచి కొందరు కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారు. అలా గోతులు తవ్వేవారిని అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీదే” అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో అధికారంలో ఉన్నవారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు.
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్న అంబేద్కర్ మాటలను స్మరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పాలనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.






