BCCI Bank Balance Swells to ₹20,686 Crore | ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ. మరే దేశ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి సమీపాన లేదు. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో రూ.20 వేల కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 28న బీసీసీఐ ఏజీఎం జరగనుంది. ఈ క్రమంలో 2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. 2024 ఆర్ధిక సంవత్సరంలో బీసీసీఐ యొక్క నగదు మరియు బ్యాంక్ బ్యాలన్స్ రూ.20, 686 కోట్లకు చేరుకుంది. ఇది 2019లో రూ.6,059 కోట్లుగా ఉండేది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే బీసీసీఐ తన సంపదను భారీగా పెంచుకుంది.
ఐపీఎల్ ద్వారా బీసీసీఐ అధిక ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. 2022లో ఐదేళ్ల కోసం ఐపీఎల్ మీడియా రైట్స్ రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెల్సిందే. అలాగే ఐసీసీ నుంచి కూడా బీసీసీఐ గణనీయమైన ఆదాయాన్ని పొందుతుంది.
ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచుల నుండి కూడా ఆదాయం సమకూరుతుంది. కాగా బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,623 కోట్ల మిగులు నమోదు చేసింది. ఇకపోతే 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ దేశంలోని స్టేడియాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.1200 కోట్లను కేటాయించింది. క్రికెట్ అభివృద్ధి కోసం రూ.500 కోట్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రూ.1990 కోట్లు మరియు ప్లాటినమ్ జూబ్లీ ఫండ్ కోసం రూ.350 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.









