Rukmini Vasanth Deep Fake Photos | సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి రుక్మిణీ వసంత్ చుట్టూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వివాదం ముసిరింది. రెండు రోజులుగా ఆమెకు సంబంధించినవిగా పేర్కొంటూ కొన్ని అభ్యంతరకర బికినీ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
అయితే, ఈ ఫోటోలపై నటి రుక్మిణీ వసంత్ స్వయంగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు పూర్తిగా నకిలీవని (Fake), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Generated Deepfakes) టెక్నాలజీతో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సృష్టించారని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్ట్ పెట్టిన రుక్మిణి.. ఈ ఫేక్ కంటెంట్ వెనుక ఉన్న కేటుగాళ్లపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
నటి తీవ్ర ఆవేదన..
వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలపై రుక్మిణీ వసంత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. టెక్నాలజీ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. “సాంకేతికతను వాడుకుని ఒక మహిళకు సంబంధించి ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం, దాన్ని వైరల్ చేయడం అత్యంత బాధ్యతారహితమైన పని. ఇది ఒక వ్యక్తి యొక్క కనీస వ్యక్తిగత గోప్యతను (Privacy) దారుణంగా ఉల్లంఘించడమే” అని ఆమె మండిపడ్డారు.
ఈ వ్యవహారాన్ని తాను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేసిన రుక్మిణి.. ఈ నకిలీ ఫోటోలను సృష్టించిన వారిని, వాటిని మొదట సర్క్యులేట్ చేసిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.
నెటిజన్లకు నటి విజ్ఞప్తి..
ఈ సందర్భంగా రుక్మిణీ వసంత్ అభిమానులకు మరియు నెటిజన్లకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నకిలీ (AI) ఫోటోలను ఎవరూ కూడా నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయవద్దని కోరారు.
సైబర్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఐటీ చట్టాల (IT Act) ప్రకారం సెలబ్రిటీల డీప్‌ఫేక్ ఫోటోలను లేదా మార్ఫింగ్ వీడియోలను ఉద్దేశపూర్వకంగా షేర్ చేయడం, లైక్ చేయడం కూడా నేరమే అవుతుందని, అలా చేసే వారి ఖాతాలపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.







