Reservation Benefits After Conversion To Islam హిందూ మతంలోని వెనుకబడిన తరగతులు లేదా షెడ్యూల్డ్ కులాల (SC) కు చెందిన వ్యక్తులు ఇస్లాం లేదా ఇతర నాన్-హిందూ మతాలలోకి మారిన తర్వాత.. వారి పాత సామాజిక ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతం మారకముందు ఉన్న సామాజిక వెనుకబాటుతనం, మతం మారిన తర్వాత కూడా ఆటోమేటిక్గా కొనసాగదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ లతో కూడిన ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.
మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు సమర్థన..
ఇస్లాం మతంలోకి మారినంత మాత్రాన తమిళనాడులోని ‘వెనుకబడిన తరగతుల (ముస్లిం)’ కేటగిరీ కింద రిజర్వేషన్లకు అర్హత లభించదని తెలిపిన మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ సమాజ వ్యవస్థ ఆధారంగా లభించే రాజ్యాంగ రక్షణలు లేదా ఆర్టికల్ 16(4) కింద లభించే రిజర్వేషన్ సదుపాయాలు.. ఇస్లాం, క్రిస్టియానిటీ లేదా ఇతర నాన్-హిందూ మతాల్లోకి మారిన తర్వాత వర్తించవు.
హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను తప్ప వేరే ఇతర మతాలను అనుసరించే వారిని షెడ్యూల్డ్ కులాలు (SC) గా పరిగణించడం సాధ్యం కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. వేరే మతంలోకి మారగానే వారు గతంలో ఉన్న ఎస్సీ హోదాను, దాని అనుబంధ ప్రయోజనాలను కోల్పోతారు.
తిరిగి హిందూ మతంలోకి మారితే?
ఒకవేళ మళ్లీ హిందూ మతంలోకి మారినట్లయితే (ఘర్ వాపసీ).. వారికి నేరుగా పాత రిజర్వేషన్లు వర్తించవు. వారు నిజంగానే పాత కుల వ్యవస్థలోకి చేరారా లేదా అన్నది సంబంధిత అధికార యంత్రాంగం స్వతంత్రంగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.








