- శ్రీలంకను చిత్తు చేసి అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు!
Indian Women Cricket Team Wins Gold Medal ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. జపాన్‌లోని ఐచి-నాగోయా ప్రాంతంలో ఉన్న ‘కరోగి అథ్లెటిక్ పార్క్’ వేదికగా మంగళవారం జరిగిన మహిళల టి20 క్రికెట్ ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడించింది.
తద్వారా భారత మహిళల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 2023 హ్యాంగ్జౌ ఆసియా క్రీడల ఫైనల్ రీ-మ్యాచ్‌గా సాగిన ఈ పోటీలో, భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏషియన్ గేమ్స్‌లో అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో శ్రీలంక వెండి పతకంతో సరిపెట్టుకోగా, బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్థాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
స్మృతి, షఫాలీ ధనాధన్ ఇన్నింగ్స్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన (45 బంతుల్లో 79), షఫాలీ వర్మ (48) పవర్‌ప్లేలోనే 66 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. మంధాన తన 37వ అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని నమోదు చేసింది.
రిచా ఘోష్ మెరుపులు.. ఆసియా క్రీడల రికార్డు..
ఆఖరి ఓవర్లలో రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో (22 బంతుల్లో 49 నాటౌట్) విరుచుకుపడటంతో భారత్ నిర్దేశిత 20 ఓవర్లలో 216/3 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. మహిళల ఆసియా క్రీడల చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ స్కోరు (గతంలో హ్యాంగ్జౌ 2023లో మంగోలియాపై హాంకాంగ్ చేసిన 202/4 రికార్డు తుడిచిపెట్టుకుపోయింది).
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో (3/6) లంక కెప్టెన్ చమరి ఆటపట్టు (29) వికెట్ తీసి కోలుకోలేని దెబ్బకొట్టింది. దీనికి తోడు షఫాలీ వర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్ తలా 2 వికెట్లతో రాణించడంతో శ్రీలంక 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ మహిళల జట్టు: 20 ఓవర్లలో 216/3 (స్మృతి మంధాన 79, రిచా ఘోష్ 49 నాటౌట్; చముడి ప్రభోద 1/34).
శ్రీలంక మహిళల జట్టు: 15.4 ఓవర్లలో 69/10 (చమరి అతపత్తు 29; దీప్తి శర్మ 3/6, షఫాలీ వర్మ 2/.. ).
ఫలితం: భారత్ 147 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.










