Thursday 15th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అయోధ్య ఆలయానికి రూ. 4 కోట్ల చెక్..ఖాతాలో ఉంది రూ. 3 మాత్రమే!

అయోధ్య ఆలయానికి రూ. 4 కోట్ల చెక్..ఖాతాలో ఉంది రూ. 3 మాత్రమే!

Ram Mandri

Ayodhya Ram Mandir 4 Crore Cheque Bounce | అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన ఒక భారీ విరాళం చెక్కు బౌన్స్ కావడం సంచలనం సృష్టించింది. ఆలయ సిబ్బంది సౌకర్యాల కల్పన కోసం చెన్నైకి చెందిన ఒక మహిళా భక్తురాలు ఇచ్చిన రూ. 4 కోట్ల చెక్కు బౌన్స్ కాగా, బ్యాంకు అధికారులు పరిశీలించగా ఆ ఖాతాలో కేవలం రూ. 3 మాత్రమే ఉండటం గమనార్హం.

ట్రస్ట్ ఈ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో బౌన్స్ అయింది. ఖాతాలో రూ. 3 మాత్రమే ఉంచుకుని ఇంత పెద్ద మొత్తంలో చెక్కు ఎందుకు జారీ చేశారో వివరణ కోరుతూ ఆ మహిళకు నోటీసు పంపేందుకు బ్యాంకు సిద్ధమవుతోంది.

నివేదికల ప్రకారం, తాను ఇచ్చిన రూ. 4 కోట్లను కేవలం ఆలయ సిబ్బంది సౌకర్యాల కోసమే వినియోగిస్తామని ట్రస్ట్ నుంచి సదరు మహిళ లిఖితపూర్వక హామీ కోరారు. ట్రస్ట్ ఎలాంటి లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ మహిళతో చర్చలు జరిపి ఈ విషయాన్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి యత్నిస్తోంది. కాగా, ఆ భక్తురాలు ఆలయానికి విడిగా రూ. 10,000 నగదు విరాళం కూడా ఇచ్చారు.

రూ. 22 కోట్ల చెక్కులు ఇంకా పెండింగ్..

ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం భారీగా నిధులు వస్తున్న వేళ ఈ సంఘటన వెలుగుచూసింది. జూన్‌లో ఆలయ విరాళాల దొంగతనం, దుర్వినియోగం వెలుగులోకి వచ్చిన రెండు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో నిర్వహించిన 45 రోజుల భారీ నిధుల సేకరణ కార్యక్రమంలో సుమారు రూ. 3,500 కోట్లు సమకూరాయి.

ఆ సమయంలో సాంకేతిక కారణాలతో సుమారు రూ. 100 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ కాగా, మళ్లీ రీ-డిపాజిట్ చేసి చాలావరకు రాబట్టారు. అయినప్పటికీ ఇంకా రూ. 22 కోట్ల విలువైన చెక్కులు వసూలు కావాల్సి ఉం‌ది. ఆలయానికి ప్రస్తుతం ప్రతి నెలా నగదు, ఆన్‌లైన్, చెక్కుల ద్వారా రూ. 3-4 కోట్ల విరాళాలు అందుతుండగా, ఒక్క చెక్కుల ద్వారానే రూ. 1-1.5 కోట్లు వస్తున్నాయి.

You may also like
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!
ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions