Konda Surekha Removal Recommendation తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి వ్యవహార శైలి, ప్రవర్తన వల్ల పార్టీకి మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని కమిటీ తీవ్రంగా భావించింది.
హైకమాండ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
ఈ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ వేగంగా అడుగులు వేస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలసి తమ సమగ్ర నివేదికను అందించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా క్రమశిక్షణ కమిటీ ప్రతినిధులు మరికాసేపట్లో కలవనున్నారు.
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు..
ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ తరఫున సిఫారసు చేశాం.
అయితే, దీనిపై తుది నిర్ణయం మాత్రం పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది.” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో తీవ్ర ఆసక్తి నెలకొంది.











