VC Sajjanar Clarification On Phone Calls Recording | ప్రతి ఒక్కరి ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయని, సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందంటూ గత కొన్ని రోజులుగా సాషల్ మీడియాలో వస్తున్న కథనాలు తీవ్ర సంచలనంగా మారాయి.
ఈ వైరల్ పోస్టుల వల్ల సాధారణ ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. పోలీస్ శాఖ ఉన్నతాధికారి వి.సి. సజ్జనర్ స్పందించారు. ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత ఫోన్ కాల్స్ ను రికార్డ్ చేస్తోందంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు, పోస్టులు పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.
ఆకతాయిల తప్పుడు ప్రచారం..
ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై సజ్జనర్ గారు తీవ్రంగా మండిపడ్డారు. “ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది” అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ అవుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, వాటిని ఎవరూ నమ్మకూడదని పిలుపునిచ్చారు.
ఫేక్ న్యూస్ క్రియేటర్లకు వార్నింగ్…
కొంతమంది కావాలనే ఇంటర్నెట్‌లో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్నారని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి మెసేజ్‌ను బ్లైండ్‌గా నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దని ప్రజలకు సూచించారు.
సమాజంలో అలజడి సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు వార్తలను (Fake News) సృష్టించే వారిపై, వాటిని వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.







