Saturday 30th May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ఢిల్లీ, ముంబైలపై భారీ ఉగ్ర కుట్ర భగ్నం!

ఢిల్లీ, ముంబైలపై భారీ ఉగ్ర కుట్ర భగ్నం!

  • ISI, అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్..
  • పాక్ గ్రెనేడ్లు స్వాధీనం!

Delhi Police Special Cell Arrests Terrorist | దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు, టార్గెటెడ్ దాడుల ద్వారా భయాందోళనలు సృష్టించేందుకు పాకిస్తాన్ సరిహద్దుల వెనుక నుండి పన్నిన ఒక భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విజయవంతంగా భగ్నం చేసింది.

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ (ISI) మరియు ముంబై అండర్‌వరల్డ్ ఎలిమెంట్స్‌ తో సంబంధాలు ఉన్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

కీలక భద్రతా సంస్థలు ఇచ్చిన పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిర్వహించిన ఒక సమన్వయ ఆపరేషన్‌లో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారి అనిల్ శుక్లా మీడియాకు వెల్లడించారు.

అరెస్ట్ అయిన నిందితుల నుండి అత్యాధునిక గ్లాక్ (Glock) పిస్టళ్లు, 25 లైవ్ బుల్లెట్లు మరియు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్ ఉన్న నాలుగు శక్తివంతమైన హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 స్వాధీనం చేసుకున్న ఈ పాక్ తయారీ గ్రెనేడ్లను ముప్పు ముంచుకురాకుండా ఉండేందుకు.. వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయంతో మెహ్రౌలీలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తరలించి సురక్షితంగా ధ్వంసం చేశారు.

ముంబై వంతెనలు, ఢిల్లీ ప్రభుత్వ భవనాలే టార్గెట్ః ఇన్వెస్టిగేషన్‌లో తేలిన వివరాల ప్రకారం.. నిందితులు సరిహద్దు అవతల ఉన్న తమ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉంటూ దాడులకు స్కెచ్ వేశారు.

 ఈ ముఠా పాకిస్తాన్‌కు చెందిన ‘షెహజాద్ భట్టి నెట్‌వర్క్’ ద్వారా ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉంది. వీరు ముంబైలోని పలు కీలకమైన వంతెనలు (Bridges), అలాగే ఢిల్లీలోని పలు ప్రభుత్వ భవనాలు, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు మరియు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉండే లొకేషన్లలో విస్తృతంగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడిన నిందితులు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. పూణేలో ‘విజయ్ షూటర్’ అనే అండర్‌వరల్డ్ డాన్‌ను, సాహిబ్‌గంజ్‌లో నితీష్ పాశ్వాన్‌ను, ముంబైలో తౌకీర్, అర్బాజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ నుండి హర్విందర్, మంజిత్‌లను అరెస్ట్ చేయగా.. ఉగ్ర ముఠాకు ఫండ్స్ సర్దుబాటు చేయడానికి ఢిల్లీ వచ్చిన 66 ఏళ్ల ఒక నేపాల్ వృద్ధుడిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions