Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్ణాటక కొత్త సీఎంగా డి.కె. శివకుమార్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే!

కర్ణాటక కొత్త సీఎంగా డి.కె. శివకుమార్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే!

Karnataka New CM DK Swearing In Ceremony Time | కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డి.కె. శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 3న (బుధవారం) సాయంత్రం 4:10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుందని శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్ స్వయంగా ధృవీకరించారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో డి.కె. శివకుమార్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. కాగా, గురువారం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పటి నుండి ఈ ప్రమాణ స్వీకార తేదీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.

అస్ట్రాలజర్ చెప్పిన ‘శుభ ముహూర్తం’

అత్యంత దైవభక్తి కలిగిన డి.కె. శివకుమార్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌ను సంప్రదించిన తర్వాతే జూన్ 3 తేదీని ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జూన్ 3 సాయంత్రం 4:10 గంటలను ప్రమాణ స్వీకారానికి అత్యంత అనుకూలమైన “శుభ ముహూర్తం”గా జ్యోతిష్యుడు నిర్ణయించారు.

రాహుల్ గాంధీ షెడ్యూల్..
ఈ తేదీని ఖరారు చేయడానికి మరో ముఖ్య కారణం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అందుబాటులో ఉండటమే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో నూతన డి.కె. శివకుమార్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం అత్యంత సరళంగా జరగబోతోంది. సిద్ధరామయ్య నిష్క్రమణ తర్వాత పార్టీలోని భిన్న వర్గాల మధ్య, వివిధ కులాలు, సామాజిక వర్గాల మధ్య సమతుల్యతను కాపాడటానికి హైకమాండ్ సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసింది.

 డి.కె. శివకుమార్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన నేతలు ఉండే అవకాశం ఉంది.

అలాగే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు నూతన ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి పదవి  దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.

రాహుల్ గాంధీ కీలక ఆదేశాలు..
శివకుమార్ వర్గం నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యను మార్చాల్సి వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ తన ‘సామాజిక న్యాయం’ (Social Justice) ఎజెండా దెబ్బతినకుండా కొత్త క్యాబినెట్‌లో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు పెద్ద పీట వేయాలని ఆదేశించారు.

అలాగే, 2028 లో జరగబోయే తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువతను ఆకర్షించేందుకు వీలుగా కేబినెట్‌లోకి ఎక్కువ మంది యువ ముఖాలను (Younger Faces) చేర్చుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions