Rare Blue Moon Phenomenon May 31 2026 | ఖగోళ ప్రియులకు సరికొత్త విందును అందిస్తూ ఈ మే నెల ఆఖరి రోజున ఒక అరుదైన అంతరిక్ష వింత ఆకాశంలో ఆవిష్కృతం కానుంది.
ఒకే క్యాలెండర్ నెలలో వచ్చే రెండో పూర్తి చంద్రుడిని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. ఈ అరుదైన దృగ్విషయం మే 31న రాత్రి ఆకాశంలో దర్శనమివ్వబోతోంది. 2026 సంవత్సరంలోనే అత్యంత అందమైన ఖగోళ వేడుకల్లో ఒకటిగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
పేరు బ్లూ మూన్.. కానీ రంగు మాత్రం గోల్డెన్-ఆరెంజ్..
ఈ ఖగోళ వింత గురించి సాధారణంగా అందరిలోనూ ఉండే అపోహలను సైన్స్ నిపుణులు క్లియర్ చేశారు. బ్లూ మూన్ అనగానే చంద్రుడు నీలం రంగులోకి మారతాడని అనుకుంటారు, కానీ వాస్తవానికి అలా జరగదు.
సూర్యాస్తమయం అయిన వెంటనే ఆకాశంలో అద్భుతమైన బంగారు-నారింజ (Golden-Orange) రంగులో ప్రకాశవంతమైన చందమామ ఉదయించి కనువిందు చేయనుంది.
ఈ మే 1వ తేదీన నెల ఆరంభంలోనే వసంత రుతువు వికసిస్తున్న తరుణంలో వచ్చే మొదటి పౌర్ణమిని ‘ఫ్లవర్ మూన్’ (Flower Moon) గా పిలిచారు. ఇప్పుడు అదే నెల ఆఖరి రోజున (మే 31) రెండో పౌర్ణమి వస్తుండటంతో దీనికి ‘బ్లూ మూన్’ అని పేరు వచ్చింది.
ఈ అరుదైన సంఘటన వల్ల సాధారణంగా ఏడాదికి ఉండే 12 పౌర్ణమిలకు బదులుగా, 2026 సంవత్సరంలో మొత్తం 13 పౌర్ణమిలు రానున్నాయి.
భారత్‌లో ఎప్పుడు.. ఎలా చూడాలి?
భారతదేశంలోని ఆకాశ వీక్షకులకు ఈ బ్లూ మూన్ స్పష్టంగా కనిపించనుంది.జ్యోతిష్య, ఖగోళ లెక్కల ప్రకారం ఈ పౌర్ణమి తిథి మే 30, 2026 మధ్యాహ్నం 11:58 గంటలకు ప్రారంభమై, మే 31, 2026 మధ్యాహ్నం 2:14 గంటలకు ముగుస్తుంది. సాంప్రదాయక రాత్రి పూజలు మే 30న, పగటి నియామకాలు మే 31న నిర్వహించనున్నారు.
మే 31వ తేదీ సాయంత్రం వేళ ఈ బ్లూ మూన్‌ను చూడటానికి అత్యంత అనుకూలమైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో హొరైజన్ (క్షితిజం), సమీపంలోని భవనాలు, చెట్ల కారణంగా ఏర్పడే “మూన్ ఇల్యూజన్” వల్ల చంద్రుడు సాధారణం కంటే చాలా పెద్దదిగా కనిపిస్తాడు.
ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక టెలిస్కోపులు లేదా పరికరాలు అవసరం లేదు. తూర్పు లేదా ఆగ్నేయ (Eastern or South-Eastern) దిశలో స్పష్టమైన ఆకాశం ఉండేలా చూసుకుని, నేరుగా కంటితోనే ఈ సుందర దృశ్యాన్ని ఎంచక్కా ఆస్వాదించవచ్చు.







