Friday 29th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా కరెన్సీపై ట్రంప్ బొమ్మ..!

అమెరికా కరెన్సీపై ట్రంప్ బొమ్మ..!

  • కొత్తగా $250 నోటు తెచ్చేందుకు యూఎస్ ట్రెజరీ సంచలన ఏర్పాట్లు..
  • 150 ఏళ్ల హిస్టరీలో ఫస్ట్ టైమ్!

Donald Trump Photo On 250 Dollar Bill | అమెరికా కరెన్సీ డాలర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన మార్పుకు వేదిక సిద్ధమవుతోంది. ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖచిత్రంతో కొత్తగా 250 డాలర్ల నోటును తీసుకువచ్చేందుకు అమెరికా ట్రెజరీ శాఖ ప్రాథమిక కసరత్తును ప్రారంభించింది.

గురువారం వైట్ హౌస్ మీడియా సమావేశంలో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కాంగ్రెస్ గనుక ఈ బిల్లును ఆమోదిస్తే, ట్రెజరీ శాఖ ఈ దిశగా ముందడుగు వేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

డాలర్ నియమాలను మార్చేలా సరికొత్త బిల్లు…
ప్రస్తుతం అమెరికా కరెన్సీ ముద్రణకు సంబంధించి ట్రెజరీ శాఖ రెండు కఠినమైన నిబంధనలను పాటిస్తోంది. మొదటిది.. జీవించి ఉన్న ఏ వ్యక్తి ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు, రెండోది.. ప్రతి నోటుపైనా తప్పనిసరిగా “In God We Trust” అనే పదం ఉండాలి.

ప్రస్తుతం క్యాపిటల్ హిల్‌లోని రిపబ్లికన్ లా మేకర్లు మొదటి నియమాన్ని సవరించేలా సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చట్టం ఆమోదం పొందితే, అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బొమ్మను కొత్త $250 నోటుపై ముద్రించడానికి మార్గం సుగమం అవుతుంది.

‘వాషింగ్టన్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ (BEP) సంస్థను దీనికి సంబంధించిన ఒక మాక్-అప్ (నమూనా) డిజైన్‌ను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించింది.

బ్రిటిష్ ఆర్టిస్ట్ ఇయాన్ అలెగ్జాండర్ రూపొందించిన ప్రాథమిక డిజైన్‌ను ట్రంప్ స్వయంగా పరిశీలించి, అందులో అమెరికన్ ఫ్లాగ్ కలర్స్ మరియు 250వ వార్షికోత్సవ ప్రత్యేక లోగోను చేర్చాలని మార్పులు కూడా సూచించారు.

250వ వార్షికోత్సవ కానుక
అమెరికా ఆవిర్భవించి 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న (250th Anniversary) వేళ, ఈ చారిత్రాత్మక మైలురాయికి గుర్తుగానే ఈ కరెన్సీ నోటును ప్రతిపాదిస్తున్నట్లు స్కాట్ బెస్సెంట్ సమర్థించుకున్నారు.

ఈ మైలురాయి సంవత్సరంలో అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న వ్యక్తి చిత్రాన్ని ఒక మెమొరబుల్ నోటుపై ముద్రించడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన పేర్కొన్నారు.

ఒకవేళ ఈ బిల్లు హౌస్ మరియు సెనేట్ లలో పాసైన తర్వాత ట్రంప్ సంతకంతో చట్టంగా మారితే.. 150 ఏళ్ల తర్వాత అమెరికా నోటుపై ముద్రితమైన ఏకైక సజీవ వ్యక్తిగా ట్రంప్ సరికొత్త రికార్డు సృష్టిస్తారు.

కాగా, ఈ ఏడాది మార్చిలోనే ట్రంప్ సంతకాన్ని యూఎస్ పేపర్ కరెన్సీపై ముద్రించనున్నట్లు ట్రెజరీ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా $250 నోటుపై ఆయన బొమ్మనే పెట్టేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions