Ex-Maoist Writes Dev Ji Inter exam | ఒకప్పుడు ఆయుధం పట్టిన చేతులు.. ఇప్పుడు అక్షరాల వైపు మళ్ళాయి. అజ్ఞాత జీవితంలో దశాబ్దాల కాలం గడిపిన ఒక మాజీ మావోయిస్టు, తన అసంపూర్ణ విద్యను పూర్తి చేసేందుకు పరీక్షా కేంద్రానికి రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ అలియాస్ తిప్పరి తిరుపతి శుక్రవారం జగిత్యాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు సప్లమెంటరీ పరీక్షకు హాజరయ్యారు.
1980వ దశకంలో దేవ్ జీ ఇంటర్ చదువుతుండగానే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) ప్రభావంతో ఉద్యమ బాట పట్టారు. అప్పటికే ఆయన ఇంటర్ పరీక్షలు రాసినప్పటికీ, తెలుగు సబ్జెక్టులో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడంతో చదువుకు విరామం పడింది.
ఏళ్ల విరామం తర్వాత..
ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆయన, తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొంది, జగిత్యాలలోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇతర విద్యార్థులతో కలిసి ప్రశాంతంగా పరీక్ష రాశారు.
ఈ పరీక్ష కోసం ఆయన జగిత్యాలలో ఒక ఉపాధ్యాయుని వద్ద ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకోవడం విశేషం. పట్టుదలతో చదివి మరీ పరీక్షకు సిద్ధమయ్యారు.
పరీక్ష అనంతరం దేవ్ జీ తన మనసులోని మాటను పంచుకున్నారు. “ఇంటర్ పూర్తయ్యాక లాసెట్ (LAWCET) రాస్తాను. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాదిగా మారి, అణగారిన వర్గాలకు మరియు పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడమే నా జీవిత లక్ష్యం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







