Kavitha comments on KCR | తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనా తీరుపై విమర్శలు చేశారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తిరుగులేని వ్యక్తి అని కొనియాడుతూనే, ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు, చివరికి కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి, అందులో సందేహం లేదు. కానీ సీఎం అయ్యాక ఆయన ఒక యంత్రంలా మారిపోయారు. కేవలం పరిపాలనపైనే దృష్టి పెట్టి, ప్రజల భావోద్వేగాలను (Emotions) మర్చిపోయారు” అని కవిత విశ్లేషించారు.
“నేను ఆయన కన్నబిడ్డను.. కానీ నా సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా నాకు దక్కలేదు. అంత కఠినంగా ఉండేవారు. కుటుంబ సభ్యులకే అందుబాటులో లేని వ్యక్తి, సామాన్య ప్రజల కష్టాలను ఎలా వింటారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని, ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మానవీయ కోణం కంటే యాంత్రిక ధోరణే ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.కేసీఆర్ తన పంథాను మార్చుకోకపోవడమే ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.







